Thursday, August 16, 2007

షిర్ది యాత్ర

నమస్తే,
మేము మొన్న షిర్ది వెళ్ళాము. దర్శనము బాగా జరిగింది, కాని దర్శనమవ్వటానికి క్యూ లో నాలుగు గంటలు వుండాల్సివచ్చింది. కాని స్వామిని చూసిన తర్వాత చాలా తౄప్తిగా ఉండింది. ఒకేరొజులో వెళ్ళివచ్చేశాము. స్వాతంత్ర్యదినొత్సవము కాబట్టి దేశం మొత్తం నుంచి జనం బాగా వచ్చారు. ప్రశాంతంగా వున్న స్వామిని చూస్తే మనసుకూడ ప్రశాంతంగా ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా తనివితీరని భువనైకసౌందర్యం సాయిబాబాది. చిన్న ఊరైన షిర్ది సాయిబాబాకి ఆతిధ్యం యివ్వడంవలన ఎంతో పుణ్యం చేసుకున్నట్లనిపించింది. వీలైనప్పుడల్లా వెళ్ళాలని నిర్ణయించుకొని సంతోషంగా యింటికి తిరిగివచ్చాము.

Monday, August 13, 2007

చిన్ని చిట్కా

నమస్తే

ఒక చిన్ని చిట్కామీరు చేసే కూరలో ఉప్పు ఎక్కువైందనుకొండి అప్పుడు దాన్లో ఒక చిన్ని అలూ ముక్కను చేర్చండి లేదా ఒక చిన్న బ్రేడ్ ముక్కను చేర్చండి, అప్పుడు అది ఎక్కువైన ఉప్పును పీల్చుకుంటుంది.

ఇప్పుడిపూడే బ్లాగ్గింగ్ ఎలా చెయ్యలో నేర్చుకుంటున్నాను. అందుకనే చిన్నచిట్కా చెప్పాను వీలైనప్పుడల్లా దీని ద్వారా అందరినీ పలకరిస్తాను. ఉంటాను

Wednesday, August 8, 2007

తెలివి--అతితెలివి

ఈరొజు నేను ఒక కధ చెపుతున్నాను. ఈరోజుల్లొ పిల్లలకు తాము చాలా తెలివైన వాళ్ళమని నమ్మకం, కాని తెలివికి అతితెలివికి గల తేడా తెలుసుకోకపొతే ఏదో ఒక రోజు చాలా ఇబ్బందిపడతారు అని ఈ కధ చెపుతుంది.

సోమయ్యకు తన కొడుకు సూర్యం చాలా తేలివైనవాడని నమ్మకం. వాడిని పట్నం తీసుకుపోయి, శివనాధుడనే గురువుకు, చదువు చెప్పమని అప్పగించాడు. కొన్నాళ్ళ తర్వాత ఏదొపని వుండి సోమయ్య పట్నం వచ్చి, తన కొడుకు చదువు ఎలా సాగుతున్నదో చూడబొయ్యాడు.

శివనాధుడు సోమయ్యతో, "నీ కొడుకు చాలా అతితెలివిపరుడు, వాడికి చదువు చెప్పడం చాలా కష్టం," అన్నాడు. ఆందుకు సోమయ్య ఒప్పుకోక, "నా కొడుకు చాలా తెలివైనవాడు, మీరు వాణ్ణి గురించి తగినంత శ్రధ్ధ తీసుకొవడం లేదు," అన్నాడు.

ఈ జవాబు విని శివనాధుడు బాధపడి, సూర్యం తెలివితేటలు ఎలాంటివో సోమయ్యకు అర్ధమయ్యేలా చెయ్యాలని వాణ్ణి పిలిచి, చూడు సూర్యం, "పూర్వం మన దేశంలో ఎంతో మంది గొప్ప చేనేత కళాకారులుండేవారు. వాళ్ళు తయారుచేసిన చీరలను అగ్గిపెట్టెల్లో పెట్టగలిగేవారట! అర్ధమైందా?" అని అడిగాడు.

సూర్యం అర్ధమైనదన్నట్టు తల ఊపాడు. "సరే, నేను చెప్పినదాన్నిబట్టి, నీకేం అర్ధమైందో చెప్పు," అన్నాడు శివనాధుడు.

"ఆ కాలంలో అగ్గిపెట్టెల్ని చాలా పెద్దవిగా-అంటే చీరలు పట్టే పరిమాణంలో తయారుచేసేవాళ్ళన్నమాట," అన్నాడు సూర్యం తడుముకోకుండా.

దానితో సోమయ్యకు తెలివికి, అతితెలివికి తేడా తెలిసివచ్చింది. ఆయన శివనాధుణ్ణి తన తొoదరపాటుకు క్షమించమని అడిగి, ఎలాగైనా తన కొడుకుని సరి ఐన మార్గంలో పెట్టమని కోరుకుని వెళ్ళిపోయాడు.

Tuesday, August 7, 2007

ఈవాళ్టి కబుర్లు

నమస్తే. మనము మనకు వీలైనంతవరకు తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నించాలి. మరీ గ్రాంధికం అవసరం లేదు కాని కొంచం కొంచం గా ఇంగ్లిష్ పదాలను తగ్గించుకుంటూ రావాలి. మనం మరీ మన మాతృభాషను కూడ మర్చిపొతున్నాము. ఇప్పుడు ఈ బ్లాగ్స్ మూలంగా కొంచం తెలుగు కనిపొస్తొంది. అందుకు నాకు చాలా సంతొషంగా ఉంది. నాకు వీటితొ పెద్దగా పరిచయం లేదు. నిదానంగా అలవాటు చెసుకుంటాను. నాకు మీ బ్లాగర్స్ అందరి సహకారం కావాలి. ఈవాళ్టికి ఇది చాలు.
సామెత: ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు మనం మన భాషలొనే సరిగ్గా మాట్లాడలేనప్పుడు మనకు వేరే భాష మీద పట్టు ఎలా వస్తుంది. కాస్త ఆలొచించండి.

Monday, August 6, 2007

తొలిపరిచయం

నేను ఒక సాధరణ గృహిణిని. నా ఆలొచనలను అందరితో పంచుకోవాలని దీనిని తయారుచేసినాను. ఈవాళ్టికి ఇంతే. రేపు మళ్ళీ కలుస్తాను. ఉంటాను.